ఫైనల్స్‌లో అనిరుధ్ సుస్వరం రెండో స్థానంలో నిలిచాడు. అతడకి రూ. 3 లక్షలు నగదు దక్కింది. మూడో స్థానంలో నిలిచిన జీవీ శ్రీకీర్తికి రూ. 2 లక్షల నగదు బహుమతిగా లభించింది. దాదాపు 26 వారాల పాటు ప్రసారమైన ఈ షోకు విశేషమైన ప్రేక్షకాధరణ దక్కింది. సంగీత దర్శకుడు ఎస్ థమన్, సింగర్లు గీతా మాధురి, కార్తీక్ ఈ షోకు జడ్జిలుగా వ్యవహరించారు. గాయకుడు శ్రీరామ చంద్ర యాంకర్‌గా వ్యవహరించారు.
నసీరుద్దీన్ 2004 నవంబర్ 2న తాడేపల్లిగూడెంలో షేక్ బాజీ, మదీనా బీబీ దంపతులకు జన్మించాడు. తండ్రి షేక్ బాజీ.. మోటార్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తల్లి మదీనా బీబీ ఏడాది కిందట మరణించారు. ఆ తర్వాత నసీరుద్దీన్‌కు అతడి సోదరి వహీదా రెహ్మాన్ అండగా నిలిచారు.
సంగీతంలో గురువైన అమ్మమ్మ ప్రోత్సాహంతో..
నసీరుద్దీన్ షేక్‌ను తాత కాసీం సాహెబ్, అమ్మమ్మ ఫాతిమా బీ.. సంగీతం వైపు ప్రోత్సహించారు. నసీరుద్దీన్ అమ్మమ్మ ఫాతిమా బీకి సంగీతంలో ప్రవేశం ఉంది. పలువురికి సంగీతంలో శిక్షణ కూడా ఇచ్చారు. చిన్నతనం నుంచి అమ్మమ్మ వద్ద పాటలు వింటూ పెరిగాడు నసీరుద్దీన్. ఘంటసాల పాటలను ఫాతిమా బీ ఎక్కువగా ఆలపించేవారు.
ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన తర్వాత నసీరుద్దీన్ మాట్లాడుతూ.. తన తాత, అమ్మమ్మను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 టైటిల్ గెలవడం తనకు ప్రత్యేకమైన మైలురాయి అని చెప్పాడు. ‘థమన్ సర్, గీతా మాధురి మేడమ్, కార్తీక్ సర్‌ల ముందు పాడటం గౌరవంగా భావిస్తున్నాను’ అని నసీరుద్దీన్ అన్నాడు.
నసీరుద్దీన్ తన ప్రాథమిక విద్యను విజ్ఞాన వికాస్ పాఠశాలలో, GSR స్కూల్లో పూర్తి చేశాడు. గుంటూరులోని శ్రీ మేధా కామర్స్ కాలేజీలో సీఏ చేశాడు. సంగీతం పట్ల తనకున్న అభిరుచిని కొనసాగిస్తూనే చార్టర్డ్ అకౌంటెంట్ విద్య అభ్యసించాడు.
చాలా బాధేసింది: గీతా మాధురి
ఫినాలే సందర్భంగా సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో పాల్గొన్న వారందరూ ప్రతిభావంతులేనని తెలిపారు. ఈ సీజన్ తనకు ఒక అద్భుతమైన అనుభవం అని అన్నారు. ‘నిజంగా ఒక సంగీత వేడుకలా ఇది అనిపించింది. ఫైనలిస్ట్‌లను ఎంచుకోవడం చాలా సవాలుగా మారింది. ఎలిమినేషన్ జరిగిన ప్రతిసారీ చాలా బాధేసింది’ అని గీతా మాధురి అన్నారు.
సింగింగ్ కాంపిటీషన్‌లో ఇండియన్ ఐడల్ ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. ఎంతో మంది సింగర్స్‌ను ఇండియన్ సినిమాకు అందించిన రియాల్టీ షోగా నిలిచింది. తెలుగు ఇండియన్ ఐడల్ షో ఆహాలో ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్‌లో ప్రతి వారం ఎలిమినేషన్ పక్రియ జరుగుతూ చివరకు ఐదుగురు పోటీదారులు మిగిలారు.
ఐదుగురి మధ్య సాగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో ఒకరిని మించి ఒకరు ప్రతిభ కనబర్చారు. సెప్టెంబర్ 20-21 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి ఆహాలో విపరీతమైన వ్యూస్ దక్కాయి. పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరైన ఈ సీజన్‌లో భిన్నమైన పాటలు, విభిన్నమైన థీమ్స్‌తో పోటీ నిర్వహించారు. పాటలతో పాటు వినోదాన్ని కూడా పంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. థమన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.