ఆ ఎమ్మెల్యేలిద్దరూ వీధిరౌడీలను మించిపోయారు: మందకృష్ణ మాదిగ

By Margam

Published on:

Follow Us
ఆ ఎమ్మెల్యేలిద్దరూ వీధిరౌడీలను మించిపోయారు: మందకృష్ణ మాదిగ


Telegram Channel Join Now
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య వివాదం ఇప్పుడు రాష్ట్రంలో అగ్గిరాజేస్తోంది. కాగా.. ఈ వివాదంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా రోడ్డెక్కడం సిగ్గుచేటని.. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు మందకృష్ణ. ఇంత హేయంగా వ్యవహరిస్తున్న కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ శాసనసభ సభ్యత్వాలను అసెంబ్లీ స్పీకర్ వెంటనే రద్దు చేయాలని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే ఇటువంటి నేతల పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ మాదిగ సూచించారు. పరస్పర దాడులు చేసుకుంటూ రౌడీలకు ఈ ఎమ్మెల్యేలు ఆదర్శంగా నిలుస్తున్నారంటూ దుయ్యబట్టారు. శాసనసభ్యుల ప్రవర్తన, మాటలు, చేష్టలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇద్దరు ఎమ్మెల్యేల ప్రవర్తన వీధి రౌడీలను మించిపోయేలా ఉందని మందకృష్ణ విమర్శించారు. ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించటంతో.. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో దూషించుకోవటం వల్ల ఎమ్మెల్యేలకు ఏమీ కాదని.. వాటి వల్ల మధ్యలో కార్యకర్తలు ప్రభావితమై బలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు.. ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలతో ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మందకృష్ణ ప్రశ్నించారు.

కాగా.. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య సవాళ్ల పర్వం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. పీఏసీ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ ప్రభుత్వం అరికెపూడి గాంధీకి ఇవ్వటంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు.. తాను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానంటూ అరికెపూడి స్టేట్ మెంట్ ఇవ్వటంతో.. అలా అయితే తన ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పటమే కాకుండా, ఆయన ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై స్పందించిన అరికెపూడి.. 11 గంటలకు రాకపోతే 12 గంటలకు నేనే వస్తానంటూ తీవ్ర పదజాలంతో అరికెపూడి ప్రతిసవాల్ విసిరారు.

ఈ క్రమంలోనే.. కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయటంతో.. అరికెపూడి గాంధీ, పదుల సంఖ్యలో తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవటంతో అక్కడే బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలోనే.. కౌశిక్ రెడ్డి ఇంటిపై గుడ్లు, టమాటలు, రాళ్లతో దాడి చేయటంతో.. ఒక్కసారిగా వివాదం మరో మలుపు తీసుకుంది.

Source link

Leave a Comment