- అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
ముద్ర, తెలంగాణ బ్యూరో : విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ సిబ్బందిపై దాడికి తెగబడి తీవ్ర నేరానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నాడు ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ లోని దామరవాయి అటవీ కార్యాలయంలో అటవీశాఖ సిబ్బంది పై జరిగిన దాడి ఘటన పై కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి ఘటనను పీసీసీఎఫ్ డోబ్రియాల్.. మంత్రికి ఫోన్లో వివరించారు.
గురువారం అర్ధరాత్రి దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను తొలగించి, నేలను చదును చేస్తున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్ళిన ఎఫ్ఎస్ఓ వినోద్, ఎఫ్ బిఓలు శరత చంద్ర, సుమన్ లు జేసీబీని స్వాధీనం చేసుకుని అటవీ కార్యాలయానికి తరలించారన్నారు. ఈ నేపథ్యంలో జేసీబీని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వచ్చిన నిందితులు అటవీ అధికారుల పై విచక్షణారహితంగా దాడి చేసి లైట్లను, జీపును ధ్వంసం చేసి జేసీబీని తీసుకుని పోయినట్లుగా మంత్రికి వివరించారు. దీంతో తీవ్ర గాయాలపాలై వరంగల్ జిల్లా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అటవీ అధికారులు వినోద్, శరత్ చంద్రలతో ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని మంత్రి సురేఖ తెలుసుకున్నారు. అటవీ చట్టాలను అతిక్రమించి, అటవీ అధికారుల పై దాడికి తెగబడి, తీవ్ర నేరానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు.