“మిస్టర్ రంగనాథ్.. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏ కట్టడాన్ని కూల్చినా రూల్ ఆఫ్ లా ఫాలో కావాల్సిందే. ఎలాంటి కూల్చివేతకైనా.. ప్రొసిజర్ పాటించాల్సిందే. మీ రాజకీయ, ఎగ్జిక్యూటివ్ బాసులను సంతృప్తి పరిచేందుకు చట్టాన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదు. మీరు నిజంగా చెరువులు, కుంటలు పరిరక్షించేందుకు పని చేస్తే.. అందుకు రూల్ ఆఫ్ లాను అమలు చేస్తే.. మీకు మా మద్దతు తప్పకుండా ఉంటుంది. చెరువుల పరిరక్షణ పేరుతో ఏదైనా కూల్చేస్తాం అంటే మాత్రం సహించేది లేదు. కూల్చివేతలపై ఇదివరకు ఇచ్చిన ఆదేశాలు చదివే ఓపిక, తీరిక మీకు ఎందుకు లేవు.” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్.
అమీన్‌పూర్ కూల్చివేతలపై స్పందించిన ధర్మాసనం.. కూల్చివేతల్లో రూల్ ఆఫ్ లా ఫాలో కాకుంటే.. చర్లపల్లి లేదా చంచల్ గూడ జైలుకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలో.. స్థానిక రెవెన్యూ సిబ్బంది అడిగితేనే.. తాము కూల్చివేతల కోసం సిబ్బంది, వాహనాలు పంపించినట్టుగా ధర్మాసనానికి రంగనాథ్ తెలిపారు. తమకు చట్టం మీద అపారమైన గౌరవం ఉందని హైడ్రా కమిషనర్ వివరణ ఇచ్చే క్రమంలో.. న్యాయమూర్తి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
చార్మినార్ ఎమ్మార్వో హైకోర్టు భవనాన్ని కూల్చాలని హైడ్రాను అడిగితే.. ముందూ వెనక ఏం ఆలోచించకుండా, ధ్రువీకరించుకోకుండా సిబ్బందిని, వాహనాలను పంపిస్తారా అని నిలదీశారు. కూల్చివేత ప్రక్రియలో భాగంగా.. కింది స్థాయి రెవెన్యూ అధికారులు రూల్ ఆఫ్ లా ఫాలో అయ్యారా? అన్నది చూసుకోరా అని ప్రశ్నించారు. ఇంత గుడ్డిగా సిబ్బందిని, బుల్డోజర్లను పంపిస్తూ.. హైడ్రా అనుమతులు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే.. అమీన్ పూర్ ఎంఆర్ఓ రాధపై కూడా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం, ఆదివారాల్లో అది కూడా వేకువజామునే కూల్చివేతలు చేయటంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. టిఫిన్ కూడా చేయకముందు కూల్చివేతలు చేపట్టరాదన్న ప్రాథమిక విషయం తెలియదా అని రంగనాథ్‌ను కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే అధికారులు జైలుకు వెళ్తారని హెచ్చరించింది. ఎవరైనా ఎమ్మార్వో లేదా కలెక్టర్ కూల్చివేత కోసం హైడ్రాను సాయం అడిగితే.. అన్ని రికార్డులు ధ్రువీకరించుకున్న తర్వాతే సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది.
“ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులుగా మీకు మంచి భవిష్యత్ ఉంది. పెద్దల ప్రభావంతో రూల్ ఆఫ్ లా ఫాలో అవకుండా చర్యలు తీసుకొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను రక్షించేందుకు మీరు పాటిస్తున్న విధానం సహేతుకం కాదు. చట్టాలను, తీర్పులను ఉల్లంఘిస్తూ ఏం సాదిద్దామనుకుంటున్నారు. రాత్రికి రాత్రే హైదరాబాద్ అంతా మారిపోతుందని అనుకోవడం భ్రమ.” అంటూ న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
“దేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. సాధారణంగా సహజ న్యాయ సూత్రాలూ ఉంటాయన్న అవగాహన ఉందా. ఒక వ్యక్తికి చట్టపరంగా ఉరేసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. అదే మాదిరి ఒక వ్యక్తి ఏ విధంగా భవనం నిర్మించుకున్నా.. కూల్చేముందు ఆ యజమానికి కనీసం నోటీసు కూడా ఇవ్వరా.? ఇచ్చిన నోటీసుకు స్పందించేవరకు ఆగలేరా..? భవన నిర్మాణ అనుమతుల రద్దుపై న్యాయస్థానం స్టే ఉంది. అవేవీ పట్టించుకోకుండా ఎలా కూలుస్తారు. శనివారం సాయంత్రం.. 18 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చి.. గడువు పూర్తికాకముందే ఆదివారం ఉదయం ఏడున్నరకు కూల్చివేయడం ఏంటీ. ఆదివారం ఉదయం టిఫిన్ చేయకుండా విధుల్లోకి వెళ్లి మరీ కూల్చేంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఎమ్మెర్వోకు ఎందుకు.” అంటూ ధర్మాసనం నిలదీసింది.
ఉదయం ఏడున్నరకే కూల్చివేతలు చేయటం అంటే.. కక్షతో చేపట్టిన చర్య కాదా అని ధర్మాసనం నిలదీసింది. సర్వే చేయకుండా.. నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించింది. అసలు ఆదివారం కూల్చివేతలు చేయరాదని జీవోలో స్పష్టంగా ఉందని ప్రస్తావించింది. రానున్న రోజుల్లో కూడా ఇలాగే చేస్తే.. సూమోటోగా.. కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి విచారణ చేస్తామని హెచ్చరించింది న్యాయస్థానం.
హైడ్రా అనేది కేవలం కూల్చివేతలకు మాత్రమే పాపులర్ అవుతోందని.. హైడ్రాకు ట్రాఫిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి బాధ్యతలు కూడా ఉన్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. కానీ.. వాటిపై హైడ్రా ఎందుకు దృష్టి పెట్టటం లేదని ప్రశ్నించింది. కేవలం కూల్చివేతలపై మాత్రమే ఎందుకు దృష్టి పెట్టారని నిలదీసింది. ట్రాఫిక్ నియంత్రణకు హైదరాబాద్ నగరంలో ఏం చర్యలు తీసుకుంటున్నారని ధర్మాసనం అడిగింది. నగర ప్రజలను భయభ్రాంతులను గురిచేయాలనుకుంటున్నారా..? అదే మీకు అప్పజెప్పిన బాధ్యతనా అని ప్రశ్నల వర్షం కురిపించింది ధర్మాసనం.
“మిస్టర్ కమిషనర్ మీకు బతుకమ్మ కుంట, నల్లకుంట అంటే తెలుసా? తాను 1983 నుంచి హైదరాబాద్‌లో నివసిస్తున్నా. కానీ ఈరోజు నల్లకుంట ఏమైంది. చెరువులను కాపాడే ప్రక్రియ ఒక్క రోజులో జరిగేది కాదు. రాత్రికి రాత్రే హైదరాబాద్ మారిపోతుందని అనుకుంటున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ఒక్క చెరువుకి సంబంధించి కూడా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదని. ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా.. అసలు సర్వే చేయకుండా అక్రమ నిర్మాణాలు అని ఎలా తేలుస్తారు. ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించకుండా.. ఎఫ్టీఎల్‌లో ఉన్నారని నోటీసులు ఎలా ఇస్తారు.” అంటూ రంగనాథ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు న్యాయమూర్తి. అయితే.. జడ్జి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన రంగనాథ్ తడబడ్డారు.