ముద్ర ప్రతినిధి, భువనగిరి : అంతర్రాష్ట్ర వైరు దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు డిసిపి రాజేష్ చంద్ర తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జోన్ రాచకొండ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొమ్మలరామారం పోలీసులు సోమవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి- భువనగిరి, మల్కాజిగిరి జోన్ ల పరిధిలో ఎలక్ట్రికల్ పోల్స్ నుండి అల్యూమినియం వైర్ ను, ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగల చోరీకి పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. నిదితులనుండి నగదు రూ.2,73,000/-, ఒక ఎర్టిగా కారు, ఒక మారుతీ XL-6, ఒక ట్రాలీ ఆటో, (200) కేజీల రాగి తీగ, (8) మొబైల్ ఫోన్లు, వారు చోరీలకు ఉపయోగించిన ఇతర -పకరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు మొత్తం విలువ సుమారు రూ.35,00,000/- ఉంటుందని చెప్పారు. నిందితులు ప్రధానంగా మారుమూల ప్రాంతాలలో ఉన్న విద్యుత్ స్తంభాల నుంచి అల్యూమినియం తీగలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగలు, దొంగతనం చేస్తుంటారని చెప్పారు. ఈ ముఠా దొంగతనం చేయాలని అనుకున్నప్పుడు, ఆరోజు సాయంత్రం 5-00 గంటలకు వారి వాహనాల ద్వారా వారు ఎంచుకున ప్రాంతానికి చేరుకుని తర్వాత గ్యాంగ్ చుట్టుప్రక్కల ప్రాంతాలలో నడక ద్వారా తిరుగుతూ ముఖ్యమైన రహదారుల నుండి సుమారు 3 నుండి 5 KMS దూరంలో ఉన్న మారుమూలగా ఉన్న అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకుంటారని అన్నారు. తర్వాత అఅ చుట్టుప్రక్కల గల దాభా హోటళ్లలో మద్యం సేవించి, భోజనం చేసి, దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల ముసుగులో సమీపంలోని పెట్రోలు బంకుల్లో తలదాచుకుని అర్థరాత్రి వరకు అక్కడే ఉండి తర్వాత తాము ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లి విద్యుత్ స్తంభాల నుంచి అల్యూమినియం తీగలు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల నుంచి రాగి తీగలను కత్తిరించి చోరీలకు పాల్పడుతున్నారన్నారు.
సోమవారం తెల్లవారుజామున బొమ్మలరామారం ఎస్ఐ నేతృత్వంలో సిబ్బంది చీకటిమామిడి ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, నిందితులు తమ వాహనాల్లో దొంగతనం చేసిన వైర్ తో తుర్కపల్లి వైపు నుండి ECIL వైపు వెళ్తుండగా, పైన తెలిపిన ఎనిమిది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమీషనర్జి. సుధీర్ బాబుయ్, డీసీపీ రాజేష్ చంద్ర, అడిషనల్ డీసీ పి లక్ష్మీనారాయణల మార్గదర్శకత్వంలో భువనగిరి ఏసిపి ఇ. రవి కిరణ్ రెడ్డి, భువనగిరి రూరల్ సీఐ ఎం.ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై బి. శ్రీశైలం, హెడ్ కానిస్టేబుల్ జి. శ్రీనివాస్, రాజ, ఎండీ మహబూబ్, నాగార్జున పాల్గొన్నట్టు చెప్పారు.